Andhra PradeshNews

జిల్లాల పర్యటనలకు చంద్రబాబు శ్రీకారం

Share with

◆ ముందస్తు ఎన్నికల తద్యమన్న భావనలో వడివడిగా అడుగులు
◆ ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఉండాలని పార్టీ నేతలకు పిలుపు
◆ 117 నియోజకవర్గ ఇన్చార్జిలతో సమీక్షలు పూర్తి
◆ నేడు జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో పర్యటన

ఏపీలో ముందస్తు ఎన్నికలు తద్యమన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలు కు ముందస్తు ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలను ఇచ్చి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా మరోసారి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దానిలో భాగంగానే నేటి నుండి మొదటిగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నందిగామల్లో పర్యటించనున్నారు. గతంలో మహానాడు అనంతరం జిల్లాల పర్యటనకు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు కొన్ని ఇబ్బందుల వల్ల పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయారు. వాస్తవానికి ఏడాది పాటు పూర్తిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటనలు చేయాలని భావించినప్పటికీ కేవలం రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రమే పర్యటించి మినీ మహానాడు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొని రోడ్ షోలను నిర్వహించారు. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం భారీ వర్షాలు వరదలతో పాటు మరోవైపు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో జిల్లాల పర్యటన కార్యక్రమానికి అప్పట్లో తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటనలు వెంటనే పూర్తిచేసే అవకాశం లేకపోవడంతో నియోజకవర్గాల ఇన్చార్జిలతో భేటికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

ఇప్పటివరకు 117 నియోజకవర్గ ఇన్చార్జిలతో ఆయన సమీక్షలు పూర్తి చేశారు. ఒకవైపు మిగిలిన సమీక్షలను కూడా పూర్తి చేస్తూనే మిగతా సమయం అంతా పర్యటనలకు వినియోగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజాక్షేత్రంలోనే పూర్తిస్థాయిలో ప్రజల్లోనే ఉంటానని ప్రకటించిన ఆయన ఆ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలి షెడ్యూల్లో 8 వారాలపాటు జిల్లాల పర్యటన చేపట్టాలని భావిస్తున్నారు. ఈ పర్యటనల ద్వారా ముందస్తు ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేయటంతో పాటు ప్రజల్లోకి చోచ్చుకు వెళ్లాలని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే చంద్రబాబు పర్యటన లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ పర్యటనలో రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఇసుక మైనింగ్ దందాతో పాటు ధరల పెరుగుదల, రైతాంగ సమస్యలు, కరెంటు చార్జీల పెంపు, రోడ్ల దుస్థితి, నిరుద్యోగ సమస్య, పరిశ్రమలు పెట్టుబడులు అంశాలను ప్రధానంగా ప్రస్తావించి ప్రజలకు వివరించాలని చంద్రబాబు సమగ్ర వ్యూహరచన చేస్తున్నారు. దీనికోసం పార్టీలోనే ఒక ప్రత్యేక భాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు ఇతర బలమైన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని చంద్రబాబు తన పర్యటనల్లో ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన పూర్తయిన వెంటనే తదుపరి పర్యటనకు అవసరమైన రూట్ మ్యాప్ ను పార్టీ యంత్రాంగం సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ పార్టీలో మరింత ఉత్సాహం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఏడాది గడువు ఉన్నప్పటికీ ఇప్పటినుండే ఆ పార్టీ అధినేతల పర్యటనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రానున్న ఎన్నికలు ఇరు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.