NationalNews

ప్రాంతీయ పార్టీలతో బీజేపీ ఢీ అంటే ఢీ

Share with

దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల పోలింగ్ మొదలయ్యింది. తెలంగాణ, బీహార్‌లో జరుగుతున్న ఎన్నికలు దేశ వ్యాప్తంగా అటెన్షన్ కలిగిస్తున్నాయ్. ముఖ్యంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు మునుగోడు అగ్నిపరీక్షగా నిలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి ఎన్నికలబరిలో నిలిచిన రాజగోపాల్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. నియోజకవర్గంలో పట్టున్న కోమటిరెడ్డి… టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీతో నితీష్ కుమార్ కటీఫ్ తర్వాత బీహార్ లో జరుగుతున్న ఎన్నికపైనా ఉత్కంఠ నెలకొంది. మూడు నెలల క్రితం ఏర్పాటైన గ్రాండ్ అలయన్స్‌కు మొకమా మరియు గోపాల్‌గంజ్ రెండు నియోజకవర్గాలు అగ్నిపరీక్షల నిలుస్తున్నాయ్. మొకమా గతంలో ఆర్జేడీ సిట్టింగ్ స్థానంగా ఉండగా, గోపాల్‌గంజ్ బీజేపీ సిట్టింగ్ స్థానం.

హర్యానాలోని అడంపూర్‌లో, మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబం ఐదు దశాబ్దాల కంచుకోటలో తన చిన్న కుమారుడు కుల్‌దీప్ బిష్ణోయ్ ఆగస్టులో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నిక. ఆగస్టులో కాంగ్రెస్ నుండి బిజెపికి మారిన తర్వాత ఏం జరుగుతుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. బిష్ణోయ్ కుమారుడు భవ్య అధికార బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్‌కు చెందిన మాజీ కేంద్ర మంత్రి జై ప్రకాష్‌ను ఢీకొంటున్నారు. జై ప్రకాష్ మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతగా గుర్తింపుపొందారు. ఎమ్మెల్యే అరవింద్ గిరి మరణంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక గోలా గోరఖ్‌నాథ్ సీటును నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మాయావతి పార్టీ బీఎస్పీ, కాంగ్రెస్‌లు పోటీకి దూరంగా ఉండడంతో బీజేపీ, అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీల మధ్య పోరు నెలకొంది.

ఒడిశాలోని ధామ్‌నగర్‌ను కూడా బీజేపీ నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే బిష్ణు చరణ్‌ సేథీ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ప్రాంతంలో బీజేడీకి గట్టి పట్టు ఉంది. మాజీ ఎమ్మెల్యే కుమారుడు, నవీన్ కుమార్ పార్టీపై బరిలో నిలిచారు. మహారాష్ట్రలో, శివసేనకు చెందిన ఉద్ధవ్ థాక్రే వర్గం ముంబైలోని అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సునాయశంగా గెలిచే అవకాశం ఉంది. పోటీ నుంచి బీజేపీ వైదొలగడంతో థాక్రే వర్గాని గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం ఉంది. ఈ ఉప ఎన్నికలు రాష్ట్రాలను ఎవరు పరిపాలిస్తాయనే దానిపై ఎటువంటి ప్రభావం చూపదని భావించినప్పటికీ, ప్రతిష్టాత్మక పోరులో ఓటమిని నివారించడానికి చాలా పార్టీలు ప్రచారానికి ముందడుగు వేసాయి. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.