Home Page SliderTelangana

బీసీలకు బాసటగా బీజేపీ, ఆత్మగౌరవ సభలో కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్

Share with

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీ.బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
పదేళ్ల క్రితం ఇదే స్టేడియానికి గుజరాత్‌ సీఎంగా నరేంద్ర మోదీ గారు వచ్చారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ దేశ చరిత్రలో మార్పునకు నాందిగా నిలిచింది. ఆ సభ తర్వాతనే మోదీ గారు భారత ప్రధాని అయ్యారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు చేయూతను అందిస్తున్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్, మజ్లిస్‌ ఒకే తాను ముక్కలు. మన్మోహన్‌ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో టీఆర్​ఎస్​ నేతలు మంత్రులుగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​కు అమ్ముడుపోయారా? లేదా? ఆ పార్టీ చెప్పాలి. 2018లో చేయి గుర్తుతో గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడుపోయారు. కనీసం నైతికంగా రాజీనామా చేయకుండా మంత్రులుగా కొనసాగుతున్నారు. ద్రౌపదిముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా హైదరాబాద్ కు వస్తే కేసీఆర్‌ స్వాగతం పలికేందుకు రాలేదు. కాంగ్రెస్‌ రాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్​ఎస్​ ఘన స్వాగతం పలికింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి

ఏజెంట్ గా వ్యవహరించారు.

కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా…. మీ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోకుండా ఉండగలరా? కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ.. బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు.. కుటుంబ, అవినీతి, దోపిడీ చేసే, కుంభకోణాల పార్టీలే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే.. బొమ్మ బొరుసు లాంటి పార్టీలు. కాషాయ జెండా మాత్రమే తెలంగాణలో మార్పు తెస్తుంది. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. పెనంమీది నుంచి పొయ్యిలో పడకూడదు. కాబట్టి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీతోనే మార్పు సాధ్యం. అమరవీరుల ఆకాంక్షలు బిజెపి తోనే నెరవేరుతాయి. గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇస్తాం. బిజెపితోనే బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసేది బిజెపి. ప్రజలందరూ ఆలోచించి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్నా.

పవన్ కళ్యాణ్, జనసేన అధినేత
సకల జనులు సమరం చేస్తే తెలంగాణ వచ్చింది. జల్‌, జంగల్, జమీన్ అంటూ కుమురం భీం పోరాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగించిన సమరం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. కానీ, అవన్నీ నినాదాలకే పరిమితం అయ్యాయి. ఒక్కటి కూడా అమలు కాలేదు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి. ఐదేళ్ల పాటు ఎన్నికలే ధ్యేయంగా ఉండొద్దు. ఎన్నికలే ధ్యేయంగా మోడీ గారు పనిచేస్తే 317 ఆర్టికల్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిరం నిర్మాణమయ్యేదా? ఎన్నికలనే మోదీ దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదు. ఎన్నికలనే మోదీ

గారి దృష్టిలో పెట్టుకుంటే మహిళాబిల్లు తెచ్చేవారు కాదు. నాలాంటి కోట్ల మంది కన్నకలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ. దేశ అభివృద్ధికి అంతర్గత భద్రత చాలా ముఖ్యం. మన దేశంపై దాడి చేస్తే తిరిగి దాడి చేయగలమని మోదీ గారు నిరూపించారు. అందుకే నాకు మోడీ అంటే అభిమానం. దేశానికి బలమైన నాయకుడు అవసరమని నాలాగే ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అందుకే మోదీ గారు ప్రధాని అయ్యారు. వారిని ముఖ్యమంత్రి చేస్తాం.. వీరిని ముఖ్యమంత్రి చేస్తామని నోటితో ఇష్టానుసారం మాట్లాడలేదు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన బీజేపీకి జనసేన నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ‘ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్’. దీనికోసం మనస్ఫూర్తిగా శాయశక్తులా కష్టపడుతా. కలిసి పోటీ చేసే అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదుల దాడులు తగ్గిపోయాయి. డిజిటల్ పేమెంట్స్ 2014లో పదో స్థానంలో ఉన్న భారత్. ప్రస్తుతం 5 స్థానంలో కొనసాగుతుంది. బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని మాటలతో చెప్పలేదు.. సీటుతో చెప్పింది. భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం కాకూడదు. బీసీ ముఖ్యమంత్రి చేయడానికి జనసేన మద్దతు తప్పకుండా ఉంటుంది. దేశం బాగుపడాలంటే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ కావాలి. ఈ ఎన్నికల్లో బీజేపీకి అండగా ఉంటాం.