Home Page SliderTelangana

తెలంగాణ రాజకీయాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్

Share with

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణాలో రాజకీయవేడి మొదలయ్యింది. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ ప్రచారం ఊపందుకుంది. ఏకంగా ఢిల్లీ నుండి హేమాహేమీలు తెలంగాణాపై ఫోకస్ పెడుతున్నారు. రోజుల వ్యవధిలోనే తెలంగాణా రాష్ట్రానికి పర్యటనలు చేస్తున్నారు. బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా చేయడం, ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటి చీఫ్‌గా నియమించడం వంటి ముఖ్యనిర్ణయాలు ఇప్పటికే అమలు పరిచారు.

ప్రధాని భారీ బహిరంగ సభ నేడు జరగుతోంది. తెలంగాణాకు ప్రధాని మోదీ వరాలజల్లు కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి నిజామాబాద్‌కు జాతీయ పసుపు బోర్డు మంజూరు చేశారు. తెలంగాణాకు ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క దేవతల పేర్లతో 900 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ నోటి వెంట ఈ హామీలు రావడంతో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రతరమైందనే చెప్పవచ్చు. పాలమూరు వేదికగా ప్రధాని సభ ఏర్పాటు కాగా, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ వేదికగా ప్రధాని సభ ఉండబోతోంది. ఎన్నికల కోడ్ ఇంకా అమలులోకి రాకపోవడంతో హామీలు గుప్పించడానికి ఈ సమయమే అనుకూలమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణా మనసెరిగి మాట్లాడుతానంటూ ప్రధాని మోదీ సంచలన ట్వీట్ చేశారు. దీనితో బహిరంగ సభలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ సభలలో ఏకంగా 8 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాబోయే రోజులలో తెలంగాణాను పర్యటిస్తారని పార్టీ ఇప్పటికే ప్రకటించారు.