Home Page SliderTelangana

వైభవంగా హనుమాన్ జన్మదినోత్సవం

Share with

ఈరోజు(ఏప్రిల్ 6) చైత్రమాస పౌర్ణమి రోజు ఆంజనేయుని జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా  జరుపుకుంటారు. తెలంగాణాలో కూడా  వైభవంగా ఊరేగించి, శోభా యాత్రను నిర్వహిస్తారు. వానరముఖుడు, వాయుపుత్రుడైన ఆంజనేయుడు మహా శక్తివంతుడు. శ్రీరామాయణ కావ్యానికి వన్నె తెచ్చిన వాడు. చిరంజీవిగా అన్ని యుగాలలో నిలిచి, శ్రీరామ నామ సంకీర్తనంతో భక్త జనులను కటాక్షించేవాడు. అటువంటి ఆంజనేయస్వామిని మహాబలునిగా, భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా పూజిస్తూ ఉంటాము. హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ శుభాలు జరుగుతాయని నమ్ముతారు భక్తులు.

రామాయణంలో సీతామాత జాడ తెలిపి శ్రీరామ చంద్రుని సంతోషపెట్టాడు. సీతమ్మకు అశోకవనంలో శోకాన్ని దూరం చేశాడు. సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి యుద్ధభూమిలో లక్ష్మణుని ప్రాణాలను కాపాడి రాముని బాధను దూరం చేశాడు. ఈ విధంగా అందరికీ శుభాలను కలిగించే ఆంజనేయస్వామిని దర్శించి, స్మరిస్తే సకల కష్టాలను తీర్చి, శుభాలను కలుగజేస్తాడు.

ఆంజనేయుడు చిరంజీవి కావడం ఇప్పటికీ ఈ లోకంలో ఉన్నాడని భావిస్తాం. ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుంటుందో అక్కడ ఆనందభాష్పాలతో హనుమ వింటూ ఉంటారని ప్రతీతి. శని ప్రభావాన్ని తగ్గించడానికి కూడా ఆంజనేయస్వామిని స్తుతిస్తారు. నవగ్రహ దోషాలు తొలగిపోవడానికి, భూత,పిశాచ శక్తుల భయం కూడా ఆంజనేయదండకం పఠిస్తే దూరమవుతాయి. ఈ రోజున సుందరకాండ పారాయణం చేస్తే శుభఫలితాలు లభిస్తాయి. ఆంజనేయుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అంశగా చెప్పబడ్డారు. అజేయుడు, శ్రీరామునికి నమ్మిన బంటుగా ఎల్లవేళలా పూజించేవాడు.

‘పవన తనయ సంకట హరణ మంగళ మారుతి రూప’ అన్నారు తులసీదాస్ హనుమాన్ చాలీసాలో. హనుమాన్ చాలీసాను ప్రతీ దినమూ పఠిస్తే సకలకార్యాలు సిద్దిస్తాయి. అటువంటి మారుతిని ఈ జన్మోత్సవం నాడు పూజించి తరిద్దాం.