Andhra PradeshHome Page Slider

దీక్షానంతరం భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Share with

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఒకరోజు నిరాహార దీక్ష చేసిన ఆమె ప్రభుత్వ చర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని, తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సునే కానీ, ప్రజాధనంపై ఎన్నడూ ఆశపడలేదని నొక్కి చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించారని హైదరాబాద్‌లో ఐటీ సంస్థల  అభివృద్ధికి ఆయన ఎంతగానో కష్టపడ్డారని, కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయించమంటూ తాను కోరేదానని వివరించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీనే ఆనాడు బ్రిటిష్ పాలకులు  జైలులో పెట్టారని, ఈనాడు ప్రజల కోసం పాటు పడుతున్న చంద్రబాబుని జైలులో పెట్టారని, తమ కుటుంబం ప్రజల కోసమే జీవిస్తున్నామని, తమకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని వాపోయారు.

మరో పదేళ్లు చంద్రబాబు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి తెలంగాణాను మించిపోయేదన్నారు. ఆయన కేవలం మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవారని, ప్రజల కోసం రోజుకు 18 గంటలు కష్టపడేవారని, తన ఆయుష్షు కూడా పోసుకుని ఆయన నూరేళ్లు జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు ఎన్నడూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని స్పష్టం చేశారు. ఆయన అరెస్టు కావడంతో తట్టుకోలేని అభిమానులు 105 మంది మరణించారని, వారి కుటుంబాలను త్వరలోనే పరామర్శిస్తానని తెలియజేశారు. తమకు ఈ కష్టకాలంలో అండగా నిలిచిన తెలుగుదేశం అభిమానులకు, కార్యకర్తలకు, తమతో పాటు దీక్షలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.