Andhra PradeshNews

ఎన్టీఆర్‌కు భారతరత్న… జగన్ భారీ స్కెచ్

Share with

ఎన్టీఆర్ పేరు అంశం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఎన్టీఆర్ పేరుని హెల్త్ వర్సిటీకి తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడంతో ఈ వివాదం రాజుకుంది. ఎన్టీఆర్ పేరు ఎలా తొలగిస్తారంటూ టీడీపీ ఆందోళనకు దిగినా… వైసీపీ ఏ మాత్రం తగ్గడంలేదు. పైగా మీకు ఆ నైతిక హక్కు లేదంటూ పాత వెన్ను పోటు ఎపిసోడ్ తెరమీదకు తెస్తోంది. టీడీపీకి కాస్తా గట్టిగానే షాక్ ఇస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఎంత కాదన్న ఎన్టీఆర్ విషయంలో వైసీపీ తప్పు చేస్తోందన్న భావన తటస్థ జనాల్లో కలుగుతోంది. ఎన్టీఆర్ పేరుని ఎత్తే హక్కు టీడీపీకి నైతికంగా లేకపోవచ్చు కానీ జనాలకు మాత్రం కచ్చితంగా ఉంది. జగన్ సర్కారు నిర్ణయం తప్పని వారు తేల్చి చెబుతున్నారు. మొత్తం వ్యవహారంపై వచ్చే ఎన్నికల్లో ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం వైసీపీకి కచ్చితంగా ఉంటుంది. రాజకీయంగా రివర్స్ అటాక్ చేసి టీడీపీ నోరు మూయించాలనుకున్నా… ఎన్టీఆర్ ఆ పార్టీ మనిషి మాత్రమే కాదు రాజకీయాలకు అతీతమైన ఇమేజ్ ఆయనది. అందువల్ల దీని వల్ల వైసీపీకి బిగ్ ట్రబుల్ తప్పదనే భావన ఉంది. దాంతో హెల్త్ వర్సిటీ విషయంలో వైసీపీ వెనక్కి తగ్గేది ఉండదు.

ఒకవేళ జగన్ ఇపుడు వెనక్కి తగ్గితే సొంత తండ్రిని అవమానపరచారన్న భారీ విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో ఇపుడు వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తోంది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వమని కేంద్రాన్ని వైసీపీ కోరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్ ఆ అత్యున్నత పురస్కారానికి అర్హుడే. ఇవ్వడానికి కేంద్ర పెద్దలు ఏనాడో సుముఖత వ్యక్తం చేసినా టీడీపీ పెద్దల ఫ్యామిలీ పాలిటిక్స్ వల్ల అది సాధ్యపడలేదన్న విశ్లేషణలు ఉన్నాయ్. ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే తీసుకునేది ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి కాబట్టే అలా చేశారని చెబుతారు. ఇక ఇపుడు చూస్తే లక్ష్మీ పార్వతి వైసీపీలోనే ఉన్నారు. ఒకవేళ భారతరత్న ఇచ్చినా ఆమె హ్యాపీగా తీసుకుంటారు. అలా వైసీపీకే మైలేజ్ వస్తుంది. ఇక ఎన్టీఆర్ అంటే జగన్‌కి ప్రత్యేక అభిమానం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతారు. అదే విధంగా చూసుకుంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలు సైతం ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్నట్టుగానే మాటలు విన్పిస్తున్నాయ్.

బీజేపీ నేతలు కూడా ఏపీలో రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్‌కి భారతరత్న ఇచ్చే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు చూస్తే ఏపీలో ఎన్టీఆర్ పేరుని హెల్త్ వర్సిటీకి తొలగించారని… జిన్నా టవర్ పేరు కూడా మార్చాలని కోరుతున్న బీజేపీ పెద్దలు సైతం ఇప్పుడు సమర్థించాల్సి ఉంటుంది. ఇలా రాజకీయంగా కమలం పార్టీకి ఇది అనుకూలాంశమే. అలాగే టీడీపీని ఇరుకునపెట్టడానికి ఎన్టీఆర్ అసంఖ్యాకమైన ఫ్యాన్స్‌ని చల్లపరచటానికి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ని వైసీపీ తొందరలో తెర మీదకు తేనుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే… ఆ క్రెడిట్ తమదేనని వైసీపీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో హెల్త్ యూనివర్సిటీ పేరు అంశం కూడా తెరమరుగవుతుంది. టీడీపీని డిఫెన్స్‌లోకి నెట్టినట్టు అవుతుంది. ఒకవేళ భారతరత్న కేంద్రం ఏ కారణం చేతనైనా ఇవ్వకపోతే ఆ తప్పు కేంద్రంలోని బీజేపీ మీద పడుతుంది. ఏపీలో ఎన్టీఆర్‌పై ప్రేమను చాటుకోవాల్సిన అవసరం ఆ పార్టీ మీదే ఉంది. ఇలా అనేక విధాలుగా కలసివచ్చేలా భారతరత్న అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని సమాచారం. మొత్తానికి ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అయితే ఆ పార్టీకి తాజాగా ఎదురైన తలపోటు ఎంత మాత్రం ఉండదు.