NationalNews

‘భారత్‌ జోడో’నా.. ‘కాంగ్రెస్‌ జోడో’నా..

Share with

ఓ వైపు ‘పప్పు’ అనే అవహేళన.. మరోవైపు ఈడీ దాడులు.. ఇంకోవైపు పార్టీలో సీనియర్ల తిరుగుబాటు.. ముప్పేట జరుగుతున్న దాడిని ఎదుర్కోవాలంటే.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఒక్కటే మార్గం అని భావించాడు ఆ యువనేత. పైగా.. రాజకీయ ఉద్ధండుడు నరేంద్ర మోడీ ఎత్తుగడలను తట్టుకొని నిలబడటం పార్టీకి కష్టమైంది. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కీలక పదవులు అనుభవించిన రాజకీయ కురువృద్ధులు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ప్లేటు ఫిరాయించారు. రాజకీయాలపై అంతగా ఆసక్తి లేని ఆ యువ నాయకుడి వల్లే పార్టీకి ఈ దుస్థితి.. అంటూ ఓ రాయి వేసి మరీ వెళ్లిపోయారు. వీళ్లందరికీ దీటైన జవాబివ్వాలంటే.. పాదయాత్ర ఒక్కటే మార్గమని భావించాడు. పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావొచ్చని.. ప్రజాదరణే అన్ని సమస్యలకు పరిష్కారమని నిర్ణయించాడు.

వేధింపులు.. ఇబ్బందులతో విసిగి..

తనను, తన తల్లి సోనియా గాంధీని ఈడీ విచారణల పేరుతో ఇబ్బందుల పాలు చేయడం.. అడ్డొచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎంపీలు, నేతలను పోలీసులతో ఇబ్బందికి గురి చేయడం.. తనకు రాజకీయాలు తెలియవని.. పప్పూ అంటూ తనను అవమానించడం.. వీటన్నింటినీ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని కంకణం కట్టుకున్నారు. అందుకే సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ‘దేశం కోసం అందరు.. దేశం కోసం ప్రతి అడుగు’ అంటూ ముందుకు కదులుతున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ ‘భారత్‌ జోడో’ అంటూ పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. ఆ యువ నాయకుడు మరెవరో కాదు.. కాంగ్రెస్‌ పార్టీ వారసుడు, జవహర్‌ లాల్‌ నెహ్రూ ముని మనవడు, ఇందిరా గాంధీ మనవడు, రాజీవ్‌ గాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీ.

టీ షర్టుపై దుమారం..

41 వేల రూపాయల విలువైన టీ షర్టు ధరించి పాదయాత్ర చేస్తున్న రాహుల్‌కు పేద ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే.. ప్రధాని మోదీ 10 లక్షల విలువైన సూట్‌ ధరిస్తున్నారని.. రూ.1.5 లక్షల విలువైన కళ్లజోడు పెట్టుకుంటున్నారని.. ఆయన పేద ప్రజల కోసం ఏం చేస్తారని కాంగ్రెస్ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అది ‘సీట్‌ జోడో’ యాత్ర అని సీపీఎం పార్టీ విమర్శించింది. కేరళ లాంటి చిన్న రాష్ట్రంలో 18 రోజుల పాదయాత్ర చేపట్టడమేంటని ప్రశ్నించింది.

ఆదరణ లభిస్తోంది: కాంగ్రెస్‌

ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎన్ని విమర్శలు ఎదురైనా అప్రతిహతంగా సాగుతున్న రాహుల్‌ గాంధీ పాదయాత్రకు తటస్థులు, విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. మోదీ ప్రభుత్వం నుంచి అవమానాలు ఎదురైన తర్వాత జనంలోకి వెళ్లిన ఈ యువనేతకు ప్రజాదరణ కూడా అదే స్థాయిలో లభిస్తోందని పేర్కొంటున్నాయి. ఆయన వెంట భారీ సంఖ్యలో జనం నడుస్తున్నారు. చిన్నారులు కూడా ‘మేము’ సైతం అంటున్నారు. ‘ఏక్‌ తేరా కదమ్‌.. ఏక్‌ మేరా కదమ్‌.. మిల్‌ జాయే.. జుడ్‌ జాయే అప్నా వతన్‌’ నినాదంతో రాహుల్‌ పాదయాత్ర ముందుకు సాగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకే..

నిజానికి ముక్కలు, చెక్కలైన కాంగ్రెస్‌ కార్యకర్తలను, నాయకులను మళ్లీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకే రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీగా మారిన కాంగ్రెస్‌ను మళ్లీ గాడిలో పెట్టాలని.. రెండేళ్లలో జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీకి దీటుగా కాంగ్రెస్‌ను నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో యాత్ర చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఇది ‘భారత్‌ జోడో’ యాత్ర కాదు ‘కాంగ్రెస్‌ జోడో’ యాత్ర అని విశ్లేషిస్తున్నారు.