Andhra PradeshNews

యానాంలో లోన్లు రికవరీ కాలేదని బ్యాంకు మేనేజరు ఆత్మహత్య

Share with

బ్యాంకు అధికారుల పాలిట శాపాలుగా మారాయి మొండి ఋణాలు. అధికారుల ఒత్తిళ్లు ఒకవైపు, లోన్లు కట్టని ఖాతాదారులు ఒకవైపు మానసిక వేదన తట్టుకోలేని ఆ పరిస్థితిలో  ఆ బ్యాంకు మేనేజరు ప్రాణాలు తీసుకున్నాడు. యానాంలో ఒక బ్యాంకు మేనేజరు సాయిరత్న శ్రీకాంత్, తన భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆయన భార్య గాయత్రి పిల్లలను తీసుకుని స్కూలుకి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. తలుపులు పగులగొట్టి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

యానాంకు రాకముందే మూడేళ్లపాటు మచిలీపట్నంలో మేనేజరుగా పనిచేసేవారు. ఋణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోవడంతో అప్పుచేసి 60 లక్షల వరకూ ఆయనే చెల్లించారు. తర్వాత యానాంకు బదిలీపై వచ్చిన తర్వాత కూడా 37 లక్షల వరకూ అప్పులు చేసినట్లు తెలిసిందని పోలీసులు వివరించారు. ఖాతాదారులు రుణాలు తీర్చేస్తారని, తమ అప్పులు త్వరలోనే తీరిపోతాయని ముందురోజు రాత్రే ఆనందంగా చెప్పారని, ఇంతలోనే ఇలా చేసుకున్నారని భార్య ఆవేదన వ్యక్తం చేసారు. బ్యాంకుల ఉన్నతాధికారులు రుణాలు ఇచ్చేవరకూ టార్గెట్స్ పేరుతో చేసే ఒత్తిళ్లు, తిరిగి నెల గడవకముందే రుణాలు తీర్చడం లేదంటూ, రికవరీలు చేయమని సతాయింపులు భరించడం మామూలు విషయం కాదు. ఆపై ఏ తప్పూ చేయకపోయినా పోలీసు, సీబీఐ కేసుల పేరుతో టార్చర్లు బ్యాంకుల మేనేజ్‌మెంటుకు పరిపాటైపోయింది. ఈ ఆవేదనలు తట్టుకోలేని సున్నితమనస్కులైన మేనేజర్లు, బ్రాంచి సిబ్బంది అప్పులు చేసి, రుణాలు తీర్చడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. రికవరీకాని మొండి బకాయిలు వారి పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి.