Andhra PradeshHome Page Slider

బీజేపీ కోర్టులో బాల్… జైలు గోడల బయటే టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన

Share with

2024లో జరగబోయే ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడానికి 2014 ఎన్నికల మాదిరిగానే టీడీపీ, బీజేపీ, జనసేనతో కలిసి ‘మహాకూటమి’ ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా పవన్ కల్యాణ్ వాదిస్తున్నారు. అయితే, బీజేపీ ఆ ప్రతిపాదనకు సంబంధించి క్లారిటీ ఇవ్వకపోవడంతో పవన్ కల్యాణ్ ఇవాళ ఒక అడుగు ముందుకేసి ‘ఉమ్మడి పోరు’ ప్రతిపాదనపై బీజేపీ ప్రతిస్పందన కోసం వేచి ఉండకుండా టీడీపీతో ఎన్నికల పొత్తును ప్రకటించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కళ్యాణ్ భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన చేశారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా పొత్తుల వ్యవహారాన్ని బీజేపీ కోర్టులోకి పవన్ కల్యాణ్ విసిరారు.

“రాజమహేంద్రవరంలో జరిగే ఈ ములాఖత్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు, రాజకీయాలకు చాలా కీలకమైనది, ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ ఇక వైఎస్సార్సీపీని భరించదు. వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనేందుకు ఉమ్మడి పోరు అవసరమని నేను ఇప్పటి వరకు చెబుతున్నాను. అయితే ఈరోజు చంద్రబాబుని కలిసిన తర్వాత 2024లో టీడీపీతో కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. చంద్రబాబు లాంటి స్థాయి వ్యక్తిని అరెస్టు చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికైనా ఏదైనా జరగవచ్చు. ఆయన అరెస్టు చట్ట విరుద్ధం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇవాళ టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్‌, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు.

“నేను ఎన్‌డిఎలో భాగమే, బీజేపీ కూడా టీడీపీ, జనసేన ఎన్నికల కూటమిలో చేరుతుందని నమ్ముతున్నాను” అని పవన్ తెలిపారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో దాదాపు 40 నిమిషాలపాటు సాగిన ములాఖత్ సమావేశంలో పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలు కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రెండు పార్టీల సమన్వయం కోసం త్వరలో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. “జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ ప్లాన్ గురించి కూడా చర్చిస్తుంది. మనం చేతులు కలపాల్సిన పరిస్థితి రావడానికి జగన్ ఒక్కడే కారణం. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది అరాచక పాలన తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ఉమ్మడి పోరాటం చేయకుంటే దశాబ్దాల పాటు ఈ అరాచక పాలన కొనసాగుతుంది. దీనికి మనం అడ్డుకట్ట వేయాలి. చంద్రబాబుతో నాకు వ్యక్తిగత విభేదాలు ఎప్పుడూ లేవు. గతంలో కొన్ని విధానపరమైన విషయాల్లో మాత్రమే విభేదించాను’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

శనివారం అర్థరాత్రి శాంతిభద్రతల సమస్యలను పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంతో అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు సంఘీభావంగా నిలవడానికి చంద్రబాబుని కలవడానికి జనసేన అధినేత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే గురువారం నాడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో అధికార వైఎస్సార్సీపీ ఆశ్చర్యపోలేదు. ఈ ప్రకటనలో కొత్తేమీ లేదు. కొంత కాలంగా గోప్యంగా పని చేస్తున్నారు. వారు ఇప్పుడు తమ ముసుగులను తొలగించారు. ఒంటరి పోరాటం చేస్తామని మా అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెబుతుంటారని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. జనసేన, బీజేపీ రెండూ మిత్రపక్షాలు అయినప్పటికీ, గత కొన్నేళ్లుగా అవి ఎప్పుడూ ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టలేదు. అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలను ప్లాన్ చేయగా, జనసేన తన సొంత కార్యక్రమాలతో జనంలోకి వెళ్లింది. జూలై 18న జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను బీజేపీ ఆహ్వానించింది.