NewsTelangana

‘18’ చుట్టూ మునుగోడు రాజకీయం

Share with

మునుగోడు ఉప ఎన్నికల్లో ‘18’ అనే అంకె కీలకంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రారంభించిన ‘18’ ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌, బీజేపీ సహా అన్ని పార్టీలూ ఇప్పుడు వల్లె వేస్తున్నాయి. మునుగోడు నియోజక వర్గంలో ఏ మూల చూసినా, ఏ నోట విన్నా ‘18’ వినిపిస్తోంది.. కనిపిస్తోంది.. వాల్‌ పోస్టర్లలో చూసినా.. మీడియాలో చూసినా.. కరపత్రాల్లో చూసినా.. ఎందెందు వెతికినా ‘18’ అనే అంకెనే కనిపిస్తోంది. ఈ ‘18’ అంకె ఇటు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నీ.. అటు కేంద్రంలోని బీజేపీ సర్కారునూ గడగడలాడిస్తోంది. ఇంతకూ ఆ ‘18’ అంకెలో ఉన్న మహత్యమేంటి..?

రూ.18 వేల కోట్ల కోసమే ఉప ఎన్నిక..

మునుగోడు ఉప ఎన్నిక రూ.18 వేల కోట్ల రూపాయల కోసమే వచ్చిందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి బీజేపీ సర్కారు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చిందని.. అందుకే రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సహా కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. రాజగోపాల్‌ రెడ్డికి ‘రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ పే’ అంటూ మునుగోడులో రాత్రికి రాత్రి పోస్టర్లు కూడా వెలిశాయి. BJP18THOUSANCRORES అంటూ ట్రాన్సక్షన్‌ ఐడీని కూడా పోస్టర్లలో ఉంచారు. మునుగోడు ఉప ఎన్నికను సృష్టించినందుకు రూ.500 కోట్ల బోనస్‌ అని పేర్కొన్నారు.

రూ.18 వేల కోట్లిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం..

తనకు ఛత్తీస్‌గఢ్‌లో రూ.18 వేల కోట్ల బొగ్గు గనుల బిడ్డింగ్‌ వచ్చిందని రాజగోపాల్‌ రెడ్డి ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో అంగీకరించిన విషయాన్ని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రస్తావించాయి. నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.18 కోట్ల నిధులు ఇస్తే మునుగోడు బరి నుంచి టీఆర్‌ఎస్‌ తప్పుకుంటుందని బీజేపీకి మంత్రి కేటీఆర్‌ సవాల్‌ చేశారు. ఫ్లోరైడ్‌ బాధితులను ఆదుకునేందుకు మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని కోరినా మొండిచేయి చూపిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒకరికి వ్యక్తిగతంగా రూ.18 వేల కాంట్రాక్టు అప్పగించడమేంటని ప్రశ్నించారు.

కేసీఆర్‌ కుటుంబ ఆధీనంలో రూ.18 లక్షల కోట్ల భూములు

ధరణి పోర్టల్‌ ద్వారా తెలంగాణాలోని 18 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేసీఆర్‌ కుటుంబం కబ్జా చేస్తోందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా నగరం చుట్టుపక్కల ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు కేసీఆర్‌ కుటుంబం ఆధీనంలోకి వెళ్లిపోయాయంటూ సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణాలో ఖాళీ భూములు కనిపించడమే పాపంగా మారిందని, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆక్రమణలు చేస్తున్నారని విమర్శించారు. ధరణి వచ్చాక ప్రభుత్వం 24 లక్షల ఎకరాల భూములను హోల్డ్‌ చేసిందని, ముడుపులు తీసుకొని 6 లక్షల ఎకరాలను ఇచ్చేసి 18 లక్షల ఎకరాలను టీఆర్‌ఎస్‌ నాయకులు పంచుకున్నారని రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు.