Andhra PradeshHome Page Slider

జులై లో ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతుందా?  బీజేపీ, వైసీపీలు డబుల్ గేమ్ ఆడుతున్నాయా?

Share with

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు ప్రతిపక్షాలు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించి నప్పటికీ,వర్షాకాల సమావేశాల అనంతరం జులైలో జగన్ అసెంబ్లీని రద్దు చేసి డిసెంబర్‌ లో తెలంగాణ తో సహా ఇతర ఐదు రాష్ట్రాలతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల దృష్టి మరల్చి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ పన్నిన ఎత్తుగడ ఇదని అంటున్నాయి.  గత వారం తిరుపతి, విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వైసీపీని, జగన్‌ను తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 జనసేన, టీడీపీ రెండూ బీజేపీ ఎత్తుగడలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ పార్టీ వైసీపీకి సహాయపడే ఉద్దేశంతో ఉందనే రూమర్లు వినిపిస్తున్నాయి.  షెడ్యుల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనను నమొద్దని టీడీపీ, జనసేన అధిష్ఠానాలు తమ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నట్లు సమాచారం. ఈ రాజకీయాలతో  ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైందనేది వాస్తవం.

మరోవైపు వారాహి యాత్రతో ప్రజల మద్దతు దక్కించుకునేందుకు తంటాలు పడుతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్.  తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఒంటరిగానే సాగుతుంది తప్ప ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు, పొత్తు ఖాయమని ఆయన చెప్పారు. తన వారాహి యాత్రను ఆగస్టులో ప్రారంభించాలనుకున్నానని, అయితే ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు ఉన్నందున, పార్టీని బూత్‌ స్థాయి నుండి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, క్యాడర్ పోల్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన పార్టీ నేతలకు చెప్పారు.