Andhra PradeshHome Page SliderTelangana

ఆంధ్రానా… తెలంగాణనా… జగన్ సోదరి వైఎస్ షర్మిల పయనమెటు?

Share with

కాంగ్రెస్, షర్మిలకు ఫ్రీ హ్యాండిచ్చేనా?
వద్దంటున్న తెలంగాణ, రారమ్మంటున్న ఆంధ్రా…
షర్మిలకు రాజకీయంగా అన్నీ మంచి శకునములేనా?
అన్న వదిలిన బాణం ఇప్పుడు ఆయనకే గుచ్చుకోబోతుందా?
కూతురు, కొడుకు మధ్య నలిగిపోతున్న వైఎస్ విజయమ్మ
షర్మిల అంతులేని కథకు విరామం లభించబోతుందా?

వైఎస్ షర్మిల… వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. తెలంగాణలో రాజకీయాలు చేద్దామనుకొని, చివరాకరకు ఏపీకి షిఫ్ట్ అవుతారా లేదంటే పెద్ద పోస్టులో సౌత్ వ్యవహారాల్లో కీలక నేతగా నిలుస్తారా? అన్న జగన్‌ను కలిసిన తర్వాత షర్మిల ఆలోచనల్లో మార్పు ఏమైనా వస్తుందా? కాంగ్రెస్ పెద్దలతో భేటీకి ముందు షర్మిల ఏ పక్కకు ఒరుగుతారు? జరుగుతారు? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వద్దు పొమ్మంటుంటే.. ఏపీ నాయకులు మాత్రం షర్మిలను రారమ్మంటూ ఆహ్వానిస్తున్నారు. మరోవైపు బ్రదర్, సిస్టర్ మధ్యలో మదర్ సెంటిమెంట్ మొత్తం వ్యవహారాన్ని రసకందాయంలో పడేస్తోంది. షర్మిల ముందున్న ఆప్షన్స్ ఏంటి? జగన్ మధ్యలో ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలేంటి? వాచ్ దిస్ స్టోరీ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తుంటే, వైయస్సార్ తెలంగాణ పార్టీతో పేరుతో వైయస్ షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఏపీలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తే… తెలంగాణలో రెండున్నరేళ్ల క్రితం వైఎస్ షర్మిల, వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి వైఎస్ షర్మిల తన వంతు సాయాన్ని అందించారు. ఓవైపు షర్మిల, మరోవైపు వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలిచి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకునేలా చేశారు. కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఆమె సోదరి వైఎస్ షర్మిలను పట్టించుకోలేదు. కనీసం దగ్గరకు కూడా తీసుకోలేదు. రాజకీయంగా దూరం పెట్టిన జగన్, ఆస్తుల పంపకాల విషయంలోనూ సరిగా స్పందించలేదన్న భావనను షర్మిల అనేకసార్లు వ్యక్తం చేశారు.

జగనన్న నుంచి సానుకూలత లభించకపోవడంతో, విసిగి వేసారి పోయిన షర్మిల తన రాజకీయం ఆంధ్రాలో కాదు, తెలంగాణలో అంటూ మకాం హైదరాబాద్‌లోని లోడస్పాండ్‌కు మార్చారు. వైఎస్సార్ తెలంగాణ పేరుతో పార్టీని ప్రారంభించి ఒక మహిళగా పార్టీని పటిష్టపర్చేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీ మూలాలతో తెలంగాణలో రాజకీయాలు చేయడం, అదీనూ ప్రత్యేక పార్టీ పెట్టి అద్భుతాలు సాధించడం కష్టమన్న భావన తెలంగాణలో ఏర్పడింది. కానీ తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో వైఎస్ షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో పూర్తిస్థాయిలో పాదయాత్ర చేసి, నాటి సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టారు. అమీతుమీకి సిద్ధమయ్యారు. కేసీఆర్‌ను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ, దొరల తెలంగాణ, కాదు బడుగుల తెలంగాణ రావాలంటూ ప్రజల్లోకి చొచ్చుకువెళ్లారు. మంగళవారం దీక్షలు నిర్వహించారు. మంగళవారం మరదలంటూ నాటి మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్‌కు షర్మిల తీవ్రంగా బదులిచ్చారు. ఎవడ్రా మరదలంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అంతేనా తెలంగాణ విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం, బహుజనుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో తనకు ఏంటి పని అని ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పేలా ఆమె తెలంగాణ మొత్తం సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు.

అయితే ఎన్నికల సమయంలో షర్మిల తీసుకున్న నిర్ణయం కొత్త పొందికలకు కారణం అవుతోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని భావించిన షర్మిల చివరకు మనసు మార్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఎన్నికలకు ముందు ఆమె తెలంగాణలో తనకు మొదటి లక్ష్యం కేసిఆర్ సర్కారును పడకొట్టడమేనని అందుకోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తానంటూ ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమై… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నట్లు తేల్చి చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేయబోతున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలో రాహుల్ రేవంత్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్న షర్మిల తెలంగాణలో ఎలా ముందడుగు వేస్తారోనన్న ఉత్కంఠ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లాలని సాక్షాత్తు రేవంత్ రెడ్డితో సహా, కాంగ్రెస్ నాయకులు చాలామంది ఆమెకు సున్నితంగా సూచనలు, హెచ్చరికలు కూడా చేశారు. అయితే తాను తెలంగాణ ఆడబిడ్డనంటూ చెప్పడమే కాదు..
రాజకీయం తెలంగాణాతోనేనంటూ తేల్చి చెప్పారు. ఐతే షర్మిల ఇప్పుడేం చేయబోతున్నారన్నదానిపై ఎంతో సస్పెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఒకలా ఉంటే షర్మిల ఆలోచన మరోలా ఉన్నాయి. షర్మిలను తెలంగాణ నుంచి ఆంధ్రాకు పరిమితం చేయాలని కాంగ్రెస్ ముఖ్యులు యోచిస్తున్నారు. ఈ ఆలోచన సోనియా, రాహుల్ గాంధీకి లేకున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆమెను ఏపీకి పరిమితం చేయాలని చూస్తున్నారు. షర్మిలకు ఉన్న పొలిటికల్ కంపల్షన్‌తో ఆమె కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండక తప్పనిసరి పరిస్థితి.

అదే సమయంలో తనకు జాతీయ స్థాయిలో ఎలివేషన్ ఇస్తే… కేరళ మినహా దక్షిణాదిలో పార్టీకి స్ట్రాంగ్ వాయిస్ అవుతానన్న భావన ఆమె కలిగించారు. షర్మిలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తుందోనని.. అందుకే కీడెంచి మేలన్నట్టుగా ఆమె వ్యవహరించాలని భావిస్తున్నారు. షర్మిల నేరుగా జగన్‌తో తలపడితే.. రాజశేఖర్ రెడ్డి లెగసీ ఏపీలో అభాసుపాలవుతుందన్న భావనలో ఉన్న విజయమ్మ, కుమార్తెను, జగన్మోహన్ రెడ్డిపై నేరుగా యుద్ధం చేయకుండా చూసుకోవాలనుకుంటున్నారు. అదే సమయంలో, తనయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న భావన ఉన్నప్పటికీ, బయటకు కన్పించకుండా.. ఆ బాధను విజయమ్మ దిగమింగుకుంటున్నారు. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి భార్యగా ఐదేళ్లపాటు తెర వెనుక మంత్రాంగానికే ఆమె పరిమితమయ్యారు. కేవలం రాజశేఖర్ రెడ్డికి భార్యగానే ఉన్నారు. కానీ ఇప్పటిలా ఎక్స్‌పోజ్ కాలేదు. కానీ వైఎస్సార్ మరణం తర్వాత సీనంతా చేంజ్ అవుతూ వస్తోంది. ఓవైపు కూతురుకు న్యాయం చేయలేని అన్న, మరోవైపు అన్నే కదా.. సరిపెట్టుకుందామన్న భావనలో లేని కుమార్తెతో విజయమ్మ మనోవేదనకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక, కుమారుడితో కలిసి ఉండాల్సిన విజయమ్మ, కూతురుతో ఉండటం కూడా విధి వైచిత్రిగా చూడాల్సి ఉంది. అంతే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా కూడా వైదొలగాల్సి వచ్చింది. అంతకుముందు విశాఖ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక అయినా ఆమె ఆ అధికార దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించకపోగా… వాటన్నింటికీ దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టి ఏపీలో ఎలా బ్రదర్ జగన్‌పై బాణం ఎక్కుపెడతారన్న ఉత్కంఠ వైఎస్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశాక, ఆమె కాంగ్రెస్ నాయకురాలు అవుతారు. జాతీయ స్థాయి నాయకురాలుగా వ్యవహరిస్తారా? లేదంటే తెలంగాణలో ఇన్నాళ్లు చేసినట్టుగా ఏపీలోనూ వ్యవహరిస్తారా అన్నది చూడాల్సి ఉంది. కొత్తగా ఏపీ రాజకీయ నాయకులుగా చలామణి అవడం అంత వీజియేం కాదు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఆమెకు రెస్పాన్స్ ఎక్కువగా ఉన్నా.. అది కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేసి రాజకీయాలు చేసిన షర్మిల, తెలంగాణలో పూర్తిగా రాజకీయాన్ని వదులుకోడానికి సిద్ధపడకపోవచ్చు. తాజాగా ఆమె మాట్లాడిన మాటలు చూసినా, తెలంగాణలో తాము పోటీ చేయకపోవడం వల్లే సుమారు 31 స్థానాలు అంటే 10 వేల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హోదా ఇస్తే ఆమె అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా, కర్నాటక, తమిళనాడుతో సహా పలు చోట్ల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనచ్చు. పార్టీకి ముఖ్యనేతగానూ ఎదగొచ్చు. ఈ విషయం షర్మిలకు తెలుసు. ఇప్పటికిప్పుడు అన్నను ఢీకొట్టి ఏపీలో అధికారం సాధిస్తామని ఆమె ఏం భావించరు. కాకుంటే, తనను గౌరవించని, లెక్కచేయని జగన్ విషయంలో ఆమె ఏమనుకుంటున్నారన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.