NationalNews Alert

స్వచ్ఛమైన గాలికోసం అమ్మల సైన్యం

Share with

దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. ప్రతీ సంవత్సరం చలికాలం వస్తోందంటే చాలు అక్కడ తల్లులకు భయం పట్టుకుంటోంది. పిల్లలకు ఏదో ఒక అనారోగ్యం వస్తోంది. ఆహారం, నీటివల్ల ఇబ్బందులైతే ఇల్లు మారడమో, తగిన జాగ్రత్తలు తీసుకోవడమో చేయవచ్చు. కానీ పీల్చే గాలే ప్రమాదమైతే ఏంచేయాలి? ఈ పరిస్థితిలో ఏంచేయాలో ఆలోచించింది పర్యావరణ కార్యకర్త భవ్రీన్ ఖందారి.

ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి ఎలర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయని ప్రకటిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ ఎలర్జీలకు కారణం వాయుకాలుష్యమే అని ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ 2020లో ఐదుగురు స్నేహితులతో ‘వారియర్ మామ్స్’ అనే సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ సభ్యులు పిల్లల తల్లులే. తమ పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళతారు. వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టకుండా చూడడం, ప్రయాణాలకు సైకిల్, లేదా ప్రజారవాణా అయిన బస్సులను, మెట్రో ట్రైన్‌లను వాడమని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వారి ప్రధాన అజెండా. చెట్లు కొట్టేస్తుండడం వల్ల స్వచ్ఛమైన గాలికి దూరమవుతున్నారని గ్రహించి దాన్ని అడ్డుకోవడానికి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.

ఈ అమ్మల సైన్యం ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ సహా 9 రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సభ్యులు పెరిగి 1000 మందికి పైగా చేరుకున్నారు. గత ఏడాది స్కాట్లాండ్‌లో జరిగిన COP26 సమావేశంలో కూడా పాల్గొన్నారు. అందరూ కలిసి ప్రయత్నిస్తే భవిష్యత్ తరాల వారికి శుభ్రమైన గాలిని అందించడం సులభమే అంటున్నారీ మాతృమూర్తులు. మనమూ మనవంతు వారికి సహకరిద్దామా..