NewsTelangana

మునుగోడులో వెల్లివిరుస్తున్న చైతన్యం…

Share with

తెలంగాణ నిర్ణయాక శక్తిగా మునుగోడు
గెలిచే వారిని బట్టి రాష్ట్ర రాజకీయాలు
రాజీనామా చేస్తేనే అభివృద్ధి చేస్తారా?
మునుగోడుకు పోటెత్తుతున్న గులాబీ దండు
ఉపఎన్నికతో భారీగా హామీలు

ప్రజలు ఒక్కసారి ఫిక్స్ అయ్యారంటే ఇక అంతే.. వారు వెనుకా, ముందు ఆలోచించరు. రాజకీయాల గురించి ప్రజలకు ఏమీ తెలియదని… వారు ఇట్టే మరచిపోతారని.. తిరిగి ఓటు అడగడానికి వెళ్లడం పెద్ద కష్టం కాదని ఇన్నాళ్లుగా నాయకగణం భావిస్తూవస్తోంది. కానీ పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఏం జరుగుతుందో కూడా ఇట్టే గ్రహించేస్తారు. కాకుంటే స్పందించేందుకు తగిన సమయం కోసం వెయిట్ చేస్తారంతే. ఇప్పుడు మునుగోడు విషయంలోనూ అదే జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలకు తెలియదని… ఎన్నిక రావడం వల్ల నియోజకవర్గానికి ఏం జరుగుతుందో కూడా తెలియదని కొందరు నేతలు భావిస్తుండొచ్చు.

ఉపఎన్నిక ఎందుకు వచ్చింది! ఉప ఎన్నిక రావడం వల్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అన్ని విషయాలపై సామాన్యులకు పూర్తి అవగాహన ఉంది. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఏమనుకుంటుంది? ప్రభుత్వం అసలు ఏం చేస్తోందన్నదానిపై క్లారిటీ కొంచెం కొంచెంగా వచ్చేస్తోంది. మునుగోడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్గా మారింది. మునుగోడులో బీజేపీ ఏం చేస్తోంది, టీఆర్ఎస్ పార్టీ నేతలేం చేస్తున్నారు? కాంగ్రెస్ ఏం చేయబోతోందన్నదానిపై జనం తెగ చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మునుగోడు మోస్ట్ పాపులర్ న్యూస్‌గా మారిపోయింది.

ఉపఎన్నికలు వస్తే నియోజకవర్గంలో రోడ్లు వేస్తారని… ఉపఎన్నిక వస్తేనే నియోజకవర్గంలో ప్రజలను మనుషులుగా చూస్తారని.. వారి సమస్యలపై స్పందిస్తారని.. ఉపఎన్నికలు వస్తే ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తారని, పింఛన్లు వస్తాయని.. నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందన్న అభిప్రాయం స్పష్టమవుతోంది. అన్నీ కలిసి వస్తే దళితబంధు లాంటి పథకాలు కూడా అమలవుతాయని ప్రజలు భావిస్తున్నారు. అందుకే హుజూరాబాద్ తర్వాత ఎమ్మెల్యేలను రాజీనామా చేయాల్సిందిగా ప్రజలు కోరడం మొదలుపెట్టారు. రాజీనామా చేస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.

హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత సమారుగా ఏడాది కావొస్తున్నా ఎవరూ కూడా రాజీనామా ఊసెత్తలేదు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా… మునుగోడును సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తరహాలో అభివృద్ధి చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ పెద్దలకు చాలా సార్లు విజ్ఞప్తి చేశారు. కానీ అది మాత్రం జరగలేదు. ఇక ప్రభుత్వం అభివృద్ధి చేయదు. పథకాలు అందించడం లేదన్న నిర్ణయానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డి చివరి అస్త్రంగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీకొట్టే దమ్ము, ధైర్యం బీజేపీకి మాత్రమే ఉన్నాయన్న నిర్ణయానికి వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరారు.

రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఆలస్యమన్నట్టుగా… నియోజకవర్గంలో వాలిపోయారు గులాబీ పార్టీ నేతలు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో నాయకులు నియోజకవర్గాన్ని జల్లెడ పట్టేస్తున్నారు. ఎవరిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి.. ఎన్నికల్లో ఎలా గెలవాలన్న ఆలోచన తప్పించి.. ఇన్నాళ్లూ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా పోయామన్న భావన అస్సలే కలగడంలేదు. ప్రజలు ఆందోళనలు చేస్తున్నా, డిమాండ్లు చేస్తున్నా అవేవీ కూడా అధికార పక్షం చెవి కెక్కడం లేదు. ఇక నియోజకవర్గ పరిధిలో ఉన్న గట్టుప్పల్ వాస్తవ్యులు ప్రత్యేక మండలం కావాలని 900 రోజులపాటు ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఎప్పుడైతే మునుగోడు ఎన్నికకు కౌంట్‍డౌన్ మొదలైందో… డిమాండ్ ఉన్న, లేకున్నా మండలాలుగా ప్రకటించేశారు.

కేసీఆర్ వర్కింగ్ స్టైల్ ఇలా ఉంటుందా అని ప్రజలంతా నివ్వెరపోయాలే పరిణామాలు కన్పిస్తున్నాయ్. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును చూశాక.. తెలంగాణ ఓటర్లు ఒక ఆలోచనకు వచ్చినట్టుగా అర్థమవుతోంది. గత రెండు మూడు నెలలుగా వస్తున్న అన్నీ సర్వేల్లోనూ టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతుంటే.. బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా ఉందని సర్వేలు వివరిస్తున్నాయ్. మొత్తంగా మునుగోడు ప్రజల చైతన్యం ఇప్పుడు రాష్ట్రానికి స్ఫూర్తిమంతంగా మారుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. మునుగోడులో టీఆర్ఎస్ ఓటమితో తెలంగాణలో కొత్త రాజకీయం మొదలవుతుందన్న భావన కలుగుతుంది.