NewsTelangana

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో భారీ స్కాం..!

Share with

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల పేరుతో తెలంగాణాలో భారీ కుంభకోణం జరుగుతోంది. ఇటీవల గురుకుల స్కూళ్లు, కేజీబీవీ మైనారిటీ హాస్టళ్లు, సబ్‌ రిజిస్ట్రార్‌, ఆర్డీవో, విద్యుత్తు, వైద్య శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌లో భారీగా ఉద్యోగావకాశాలు కల్పించారు. అయితే.. గతంలో నిజామాబాద్‌ జిల్లాలో, ఇప్పుడు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చేపట్టిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో ఫార్మసిస్టుల నియామకాలు జరిగాయి. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్‌ సహాయకులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే తమ అనుచరులను ఫార్మసిస్టులుగా నియమించుకున్నారు.

కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారు

ఓ సీనియర్‌ సహాయకుడు ఫార్మసిస్టు ల్యాబ్‌ టెక్నీషియన్‌ సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నాడు. మరొకరు 104 సేవలు, ఇతర సిబ్బంది పరిపాలన వ్యవహారాలు చూస్తున్నాడు. ఈ ఇద్దరు జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఆరోపణలొస్తున్నాయి. పాలమూరు జిల్లాలో ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు మొత్తం 23 ఉన్నాయి. అందులో 25 మంది ఫార్మిసిస్టులు, 25 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. వీరిలో 23 మందిని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా నియమించుకున్నారు. అందులో నలుగురు 104 సర్వీసు నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిరు. మిగిలిన 19 మందిలో కొందరి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి.

అధికారుల జాతకం సిబ్బంది చేతిలో..?

అంతేకాదు.. బాలనగర్‌ ఫార్మసిస్ట్‌ అక్కడ పని చేయడం లేదు. జడ్చర్లలో పోస్టింగ్‌ ఉన్న మరొకరు అధికారుల మాట వినకుండా మహబూబ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో ఇప్పటికే ఫార్మసిస్టులు ఉన్నా.. వైద్య సిబ్బంది తమ కుటుంబ సభ్యులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వడం వివాదాస్పదం అవుతోంది. అధికారుల అక్రమాల జాతకాలు సిబ్బంది వద్ద ఉన్నాయని.. అందుకే సిబ్బంది తమ కుటుంబ సభ్యులను ఔట్‌ సోర్సింగ్‌లో నియమించుకున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలు అడిగితే అధికారులు ఇవ్వడం లేదు. ఈ నియామకాల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చామంటున్న అధికారులు.. ఏ దినపత్రికలో ఇచ్చారో చెప్పడం లేదు. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో.. ఏ మెరిట్‌ ప్రాతిపదికన నియామకాలు చేపట్టారో చెప్పలేకపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. పొరుగు సేవల ఉద్యోగుల నియామకాల పేరిట అవకతవకలు జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేసే వాళ్లు కరువయ్యారు.