Andhra PradeshNews Alert

రైళ్లో చిన్నారి జననం… పురుడుపోసిన మెడికల్ స్టూడెంట్

Share with

ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం ఒక వరం. గర్భిణిగా ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రసవం ఏ ఇబ్బంది  లేకుండా వైద్యుల సమక్షంలో జరగాలని కోరుకుంటారు.  కానీ అనుకోని పరిస్థితుల్లో ఏ ప్రదేశంలో అయినా డెలివరీ జరగవచ్చు.  మనం అప్పుడప్పుడు విమానంలో శిశువు జన్మించాడు, బస్సులో, ట్రైన్లలో జన్మించారని వార్తల్లో వింటూ ఉంటాం. అంతా సవ్యంగా జరిగితే పర్వాలేదు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది.  ఇలాంటి సంఘటనే నిన్న ‘దురంతో ఎక్స్‌ప్రెస్‌’లో జరిగింది.

హైదరాబాద్ నుండి విశాఖపట్నం బయలుదేరిన, శ్రీకాకుళానికి చెందిన ఒక గర్భిణి స్త్రీ తెల్లవారుజామున ‘దురంతో ఎక్స్‌ప్రెస్‌’లో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బి6 కంపార్ట్‌మెంట్‌లో ఒక గర్భిణి స్త్రీ ప్రయాణిస్తోంది. రాజమండ్రి దాటిన తర్వాత హఠాత్తుగా ఆమెకు నొప్పులు రావడం మొదలయ్యింది. అదృష్టవశాత్తూ అదే కంపార్ట్‌మెంట్లో ప్రయాణిస్తున్న స్వాతి రెడ్డి అనే అమ్మాయి చూసింది. స్వాతి రెడ్డి విశాఖ గీతం మెడికల్ కాలేజిలో హౌస్ సర్జన్ చేస్తోంది. ఆమె వెంటనే రియాక్టయి తోటి మహిళల సాయం తీసుకుని డెలివరీ చేయడం జరిగింది.

తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు స్వాతి రెడ్డి తెలిపారు. తోటి ప్రయాణికులందరూ తల్లికి, స్వాతికి అభినందనలు తెలిపారు. టీటీ ముందుగా సమాచారం ఇవ్వడంతో అనకాపల్లిలో ట్రైన్ ఆగిన వెంటనే అప్పటికే వేచి ఉన్న అంబులెన్సు సహాయంతో తల్లి బిడ్డలను తీసుకుని డాక్టర్ స్వాతి రెడ్డి ఎన్టీఆర్ ప్రభుత్వ హెల్త్ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లి బిడ్డకు కావలసిన వాక్సినేషన్ ఇప్పించారు.

రైల్లో జన్మించిన ఈ పాపకు జీవితాంతం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అనకాపల్లి స్టేషన్ మాస్టర్ చెప్పడం జరిగింది. స్వాతి రెడ్డికి గీతం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌తో పాటు  గైనకాలజీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. ప్రాక్టికల్‌గా విద్యార్థి దశలోనే ఇలా డెలివరీ చేయవలసి రావడం తన జీవితంలో మరుపురాని ఘట్టం అని, దేవుడు ఇచ్టిన అవకాశంగా భావిస్తానని స్వాతిరెడ్డి  సంతోషం వ్యక్తం చేసింది.