Home Page SliderTelangana

దర్శకధీరుడు రాజమౌళి మెచ్చిన మహిళలు కట్టిన బెలూన్ థియేటర్

Share with

మహిళలు తలచుకుంటే చెయ్యలేని పని లేదు. వారికి కావల్సిన సదుపాయాలను వారే కష్టపడి సమకూర్చుకున్నారు కుమరం భీం జిల్లా మహిళలు.  పైసా పైసా కూడబెట్టి పొదుపు చేసిన డబ్బుతో కట్టి, వారే నిర్వహిస్తున్న బెలూన్ థియేటర్ రాజమౌళి దంపతుల మనసు దోచుకుంది. వారు స్వయంగా అక్కడికి వచ్చి వారిని అభినందించారు..

బెలూన్ థియేటర్ నిజంగా బెలూన్ థియేటరే. గాలితో నిండిన పెద్ద బుడగలా ఉండే ఈ థియేటర్లో 120 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. హెచ్‌డీ ప్రొజెక్టర్, 5.2 డాల్బీ డిజిటల్ సౌండ్, ఏసీ, కుషన్ సీట్లు కూడా ఉన్నాయి. కుమరం భీం జిల్లాలో ఒక్క సినిమా థియేటర్ కూడా లేదు. వారు సినిమా చూడాలంటే పక్కజిల్లాకి వెళ్లాల్సిందే. అందుకే అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలు నడుం బిగించి పిక్చర్ టైమ్ సంస్థ సహాయంతో థియేటర్ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. తేలిగ్గా, తక్కువ సమయంలో నిర్మించే బెలూన్ థియేటర్‌ని అసిఫాబాద్‌లో నిర్మించారు. వారు పొదుపు చేసిన 30 లక్షలనే పెట్టుబడిగా పెట్టగా, పిక్చర్ టైమ్ సంస్థ మరొక 20 లక్షల ఆర్థిక సహాయం అందించారు.

సినిమాను ఎలా డౌన్‌లోడ్ చేయాలో, ఎలా ప్రదర్శించాలో, అందుకు సంబంధించిన లైసెన్సులు తీసుకోవడం, టిక్కెట్లు ఇవ్వడం వంటి విషయాలపై పిక్చర్ టైమ్ సంస్థవారే వీరికి వారం రోజుల శిక్షణను కూడా అందించారు. లాభాలలో మహళలకు 60 శాతం, పిక్చర్ సంస్థకు 40 శాతం వాటాలు వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. వారికి మొదటి ఏడాదిలోనే 10 లక్షల ఆదాయం వచ్చిందట. ఇది దాదాపు వారి పెట్టుబడిలో 30 శాతం. వీరి విజయాన్ని చూసి, అక్కడి స్థానిక పంచాయితీ కోటి రూపాయలు నిధులు కేటాయించారు. ఈ నిధితో ప్రహారీ, చిరుతిళ్ల దుకాణాలు, శౌచాలయాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు చుట్టుపక్కల కుగ్రామాలలో పేద సంఘాల మహిళలకు కూడా స్వయం ఉపాధి రుణాలను అందిస్తున్నామని సంతోషంగా తెలిపారు మహిళలు.