Home Page SliderNational

ఢిల్లీ వరదల ప్రభావంతో  200 కోట్ల నష్టం

Share with

గత 50 ఏళ్లలో  ఎన్నడూ లేనంతగా భారత్ రాజధాని ఢిల్లీ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రశాంతంగా ఉండే యమునానది మహోగ్రరూపాన్ని ధరించింది. ఉవ్వెత్తున ఎగసిపడి ఢిల్లీ నగర రోడ్లన్నింటినీ జలమయం చేసేసింది. ప్రమాదకర స్థాయిని దాటి 208. 46 మీటర్లకు చేరింది. సాక్షాత్తూ సీఎం కేజ్రీవాల్ ఇంటి పరిసరాలే ముంపునకు గురయ్యాయి. ప్రసిద్ద ప్రదేశాలైన సుప్రీంకోర్టు, రెడ్‌పోర్ట్, రాజ్ ఘాట్‌లు వరదలో మునిగాయి. వాణిజ్యనగరమైన ఢిల్లీ వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని చవి చూసింది.

యమునాబజార్ నుండి ఎర్రకోట దాకా గల వ్యాపార ప్రదేశాలలోని అనేక షాపులు, ఇళ్లు నీట మునిగాయి. దీనితో గత నాలుగురోజుల్లో దాదాపు 200 కోట్ల నష్టం జరిగిందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. యమునానది నీటిమట్టం పెరగడం వల్ల, రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇతర రాష్ట్రాల నుండి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. అనేక వ్యాపారాలకు నిలయమైన చాందినీ చౌక్, జామామసీద్, నయాబజార్, కినారీ బజార్, కాశ్మీరీ గేట్ ,మీరట్, ఘజియాబాద్, పానిపట్ వంటి ప్రాంతాలు నిరంతరం కస్టమర్లతో కళకళలాడుతుంటాయి. రైళ్లు, బస్సులు, మెట్రోలతో సహా ఢిల్లీ రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించింది. దీనితో ఎవ్వరూ ఢిల్లీ మార్కట్లకు వచ్చే ధైర్యం చేయట్లేదు.

ఉద్యోగులు కూడా ఇంటివద్ద నుండే పని చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అత్యవసర ప్రభుత్వ ఉద్యోగులు మినహా ఎవ్వరూ రోడ్లపైకి రాని పరిస్థితి ఏర్పడింది. తొందరలో సాధారణ స్థితికి రాకపోతే రాజధాని నగరం భారీ నష్టాన్ని చవి చూడవలసి వస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.