Home Page SliderInternational

102 ఏళ్ల భారతీయ అమెరికన్ ‘సీఆర్ రావు’కు స్టాటిస్టిక్స్‌లో నోబెల్‌తో సమానమైన బహుమతి

Share with

కొందరిని చూస్తే వ్యక్తులు కాదు, నడిచే విజ్ఞాన గ్రంధాలు అనిపిస్తుంది. ఈ మాట ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త భారతీయ మూలాలున్న కల్యంపూడి రాధాకృష్ణారావుకి సరిగ్గా సరిపోతుంది. 102 సంవత్సరాల వయస్సున్న  ఆయనకు గణితంలో, స్టాటిస్టిక్స్‌లో చేసిన కృషికి గాను ఆయనకు నోబెల్‌తో సమానమైన అత్యున్నత గౌరవం దక్కబోతోంది. ఈ సంవత్సరం జూలైలో అత్యున్నత గణాంక బహుమతిని కెనడాలో అందుకోబోతున్నారు. సుమారు 75 ఏళ్ల క్రిందటే గణితంలో ఆయన చేసిన పరిశోధనలు ఈనాటికీ సైన్సుపై ప్రభావాన్ని చూపుతున్నాయని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ తెలిపింది. కెనడాలోని అట్టావాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుతో పాటు 80 వేల అమెరికన్ డాలర్ల బహుమతి కూడా లభిస్తుంది.

ఈయన 1920 లో బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా ఆంధ్రాలోనే జరిగింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ మ్యాథ్స్ చేసి, యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. దేశవిదేశాలలో ఎన్నో పీహెడీలు చేసిన ఆయన ఏకంగా 39 డాక్టరేట్లు సంపాదించారు. 2002లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ చేతుల మీదుగా అమెరికా అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆయనను, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 1945లో కోల్‌కతా మేథమేటికల్ సొసైటీలో ప్రచురణలకు గాను  సీఆర్ రావు చేసిన పరిశోధనలకు ఈ అత్యున్నత అవార్డు దక్కబోతోంది. ఆయన ఈ వయస్సులో కూడా యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఆయన చేసిన పరిశోధనలు ఆధునిక గణాంక విధానానికి దారి చూపించాయి.